KTR: నిరూపిస్తే మేమంతా రాజీనామా చేస్తాం...! 1 d ago
TG: సాగు విస్తీర్ణం పెరగాలనే ఉద్దేశంతోనే రైతుబంధు ఇచ్చామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. శాసనసభలో కేటీఆర్ మాట్లాడుతూ... ‘‘2019-20లో సాగు విస్తీర్ణం 141 లక్షల ఎకరాలుందన్నారు. 2020-21లో సాగు విస్తీర్ణం 204 లక్షల ఎకరాలని నివేదికలో తెలిపారు. రైతుబంధు ఇవ్వడం వల్లే సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందన్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వం ఇచ్చిన నోట్ స్పష్టం చేస్తోందని వెల్లడించారు.
4.50 లక్షల మంది గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చామన్నారు. పోడు పట్టాలున్న గిరిజనులకు రైతుబంధు ఇస్తారో.. లేదో ప్రభుత్వం చెప్పాలని నిలదీశారు. రైతుబంధుకు కోతలు పెట్టే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందన్నారు. లేకపోతే.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి గురించి మంత్రి చెప్పేవారు కాదని అన్నారు. తెలంగాణలో పీఎం కిసాన్ సమ్మాన్ 20 శాతం మంది రైతులకే వస్తోందని తెలిపారు. రైతుబంధు యథాతథంగా ఇస్తామంటే.. ఈ చర్చ ఎందుకు? పత్తి, కంది 8 నెలల పంట.. ఆర్థిక సాయం ఒక పంటకు ఇస్తారా? రెండు పంటలకు ఇస్తారా అనేది ప్రభుత్వం చెప్పాలన్నారు. పామాయిల్, మామిడి, ఉద్యాన పంటలకు రైతుభరోసా ఇస్తారా? 3 పంటలు సాగు చేసే రైతులకు మూడు విడతలుగా ఇస్తారా? మూడో పంటకు ఇవ్వాలని గతంలో రేవంత్ అన్నారని వ్యాఖ్యానించారు.
అసెంబ్లీ సమావేశాలు పది రోజులు పొడిగించాలన్నారు. ఎలక్ట్రిసిటీ, ఇరిగేషన్, మిషన్ భగీరథపై చర్చ చేపట్టాలన్నారు. నల్గొండ జిల్లా అభివృద్ధిపై కూడా ఒకరోజు చర్చ చేపట్టాలని చెప్పారు. గతంలో జరిగిన తప్పులు ఎత్తిచూపితే మీకు ఇబ్బందిగా ఉందని విమర్శించారు. గతంలో చేపట్టిన ప్రాజెక్టులకు మాత్రం డబ్బా కొట్టడం సబబా? బీఆర్ఎస్ హయాంలో 24 గంటల విద్యుత్ ఇవ్వలేదని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో సగటున 19.2 గంటల విద్యుత్ ఇచ్చినట్లు ఉప ముఖ్యమంత్రి చెప్పారన్నారు. కాంగ్రెస్ పాలనలో 24 గంటలు ఇస్తున్నట్లు ప్రకటనలు గుప్పిస్తున్నారు. సభ వాయిదా వేసి నల్గొండ జిల్లాకు వెళ్లి పరిస్థితులు పరిశీలిద్దామన్నారు. 24 గంటల విద్యుత్ ఇస్తున్నట్లు చూపెడితే బిఆర్ఎస్ శాసనసభాపక్షం మొత్తం రాజీనామా చేస్తుందని సవాల్ విసిరారు. రైతుబంధు మీద కాంగ్రెస్ విపరీతమైన దుష్ప్రచారం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు బతుకును మార్చిన గేమ్ ఛేంజర్ రైతుబంధు’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.